ట్రిబ్యునళ్లలో  కేసుల వివరాలివ్వండి

ట్రిబ్యునళ్లలో  కేసుల వివరాలివ్వండి
  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సీసీఎల్ఏ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ట్రిబ్యునళ్లలో విచారించిన భూసంబంధిత కేసుల వివరాలు పంపాలని అన్ని జిల్లాల కలెక్టర్లను చీఫ్‌ కమిషనర్‌‌ ఫర్‌‌ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) శనివారం ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ఫార్మాట్ను పంపించారు. తెలంగాణ రైట్స్ఇన్ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ యాక్ట్–2020లో పేర్కొన్నట్లుగా రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న అప్పీళ్లు, రివిజన్ పిటిషన్ల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. అయితే ట్రిబ్యునళ్లలో కేసుల విచారణకు నెల రోజులే డెడ్ లైన్ విధించడం, ఇరుపక్షాలు, అడ్వకేట్ల వాదనలు వినకుండా ఏకపక్షంగా తీర్పులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ నండూరి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. ట్రిబ్యునళ్లలో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీర్పులు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. స్పెషల్ ట్రిబ్యునళ్లలో విచారించిన కేసుల వివరాలను రెండు వారాల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యేక ఫార్మాట్ లో కేస్ వైజ్ డేటా పంపాలని సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేశారు. కేసు నంబర్, యూనిక్ కేసు నంబర్, జిల్లా, కేస్టైప్, కేసు ట్రాన్స్ ఫర్ చేసిన అథారిటీ(తహసీల్దార్,ఆర్డీఓ, జేసీ, సీసీఎల్ఏ) వివరాలు తెలపాలని పేర్కొన్నారు.